తెలుగుభాషకు, తెలుగువారి సమైక్యతకు జవజీవాలు పోసిన మహామహులలో సురవరం ప్రతాపరెడ్డి ఒకరు.
వారి జీవిత కాలంలో చేసిన నాలుగు దశాబ్దాల సాహితీ సేవ ఎవరెస్ట్ శిఖరం లాంటిది. మహా పరిశోధకుడిగా, రచయితగా, భాషోద్యమనాయకుడిగా, పాత్రికేయుడిగా, గ్రంథాలయోద్యమకారుడిగా, విమర్శకుడిగా, స్త్రీజనోద్దారకుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన బహుముఖీన సేవా కార్యక్రమాలు నేటి తరానికి ఆదర్శాలే. ఆయన నిజామాంధ్రలో ఆంధ్రమహాసభ ద్వారా చేసిన భాషా సేవ, గోలకొండ పత్రిక స్థాపన, సంపాదకత్వం బాధ్యతల నిర్వహణ, తెలంగాణ ప్రాంత సాహిత్య చైతన్య దీపికగా ఆయన వెలువరించిన గోలకొండ కవుల సంచిక, ఇరవై ఏళ్లపాటు పరిశోధించి, శ్రమించి తెలుగుజాతికి అమూల్య కానుకగా, వారసత్వసంపదగా ఇచ్చిన ఆంధ్రుల సాంఘీక చరిత్ర ఉద్గ్రంథం, ఆయన రాసిన రచనలు, చేసిన తెలుగు భాషాసేవ అపారం, గురజాడ, గిడుగు, కందుకూరి వీరేశలింగం పంతులు వలె, రెడ్డిగారు ఆంధ్రమహాసభ ఉద్యమ నాయకునిగా, తెలుగు సాహిత్యోద్యమ వైతాళికులుగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలలో లిఖించబడ్డారు. అందుకే తెలుగుభాషోద్యమ సమాఖ్య వారు ఆయన జయంతి మే 28న తెలుగుజాతి వారసత్వ దినోత్సవం ప్రకటించి, తెలుగు జాతి, సాహితీ, భాషా సంస్కృతుల ఔన్నత్యా నికి తెరలేపింది. ఆ మహామహుని సేవలను, త్యాగమయ సాహితీ జీవితాన్ని తెలుసుకుంటే కొంతైనా మన మాతృభాషపైన తెలుగుపట్ల అభిమానం పెరుగక తప్పదు. బ్రిటిష్ వాడి భాషా వ్యామో హానికి, పాశ్చాత్య సంస్కృతికి లోనైన మనకు, మన మాతృభాషైన తెలుగు ధనం విలువలు తెలియాల్సి వుంది. తెలుగునాట ఎక్కడచూసినా, వ్యాపార వస్తువుగా పరిగణింపబడుతున్న ఆంగ్ల బడులే అధికంగా కనిపిస్తున్నాయి. వాటికి లభిస్తున్న ఆదరణ అంతా, ఇంతా చెప్పనలవికాదు. నర్సరీ నుండి పీజీ స్థాయి వరకు, వైద్య సాంకేతిక కోర్సులలో ఆంగ్లభాషే ఆదిపత్యం చల యిస్తుం డగా, మమ్మి, డాడీలను పిలిపించుకోవాలన్న తహతహ పట్ల అన్ని వర్గాల ప్రజలు ప్రీతి కనబరుస్తుండటం గమనించదగిన విషయం. తెలుగుభాషకు ప్రాచీన హోదాను కట్టబెడుతున్నట్లు కేంద్ర ప్రభు త్వం ప్రకటించినా, తెలుగువాడిలో రావాల్సినంత చైతన్యం కానరావడం లేదు, ఇందుకై చర్చిస్తే ఎన్నెన్నో కారణాలు కనబడ తాయి. నిస్తేజంగా, నిర్లిప్తంగా వున్న తెలుగువాడిలో తెలుగుభాషా తేజం, చైతన్యం ప్రజ్వలింపజేయాల్సి వుంది, కొలిమి రగల్చాల్సిన తరుణం ఆసన్నమైంది. లేకుంటే ఐక్యరాజ్యసమితి నివే
దికలోచెప్పినట్లుగా, 30 శాతం మంది ఆభాషకు దూరమైతే, సమీప కాలంలో ఆభాష కనుమరుగైపోతుంది. ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితులలో భాషా చైతన్యం, భాషోద్యమం రాజుకోవాలి.
Read 6966 times | |
Published in History/చరిత్ర |