Print this page

శ్రీపాద అనుభవాలూ – జ్ఞాపకాలూనూ

ఈ పరిచయం శ్రీపాద వారి “అనుభవాలూ  జ్ఞాపకాలూనూ” గురించి. ఇంట్లో చిన్నప్పటి నుంచి శ్రీపాద వారి చిన్నకథల పుస్తకాలున్నా కూడా ఎప్పుడు చదివిన పాపాన పోలేదు .

తర్వాత ఆ మధ్యన మా అక్క ఈ పుస్తకం బాగుందని చెప్పినా కూడా కుదరలేదు. అటు తర్వాత ఎపుడో ఒక సారి ఒక మిత్రునితో చర్చలో జరుక్ శాస్త్రి గారు ఈ పుస్తకం గురించి అన్న మాటల గురించి ప్రస్తావించటం జరిగింది. ఆ మాటలలో ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని విశ్వనాథ, చలం గార్లతో పాటు లెక్క కట్టి కొన్ని మంచి మాటలు రాసారు. తక్కిన ఇద్దరివి కాస్తో కూస్తో చదివాను కాబట్టి ఇక శ్రీపాద వారి పుస్తకం కూడా చదవాలి అని అనుకున్నాను. అయినా కుదరలేదు. అటు తర్వాత మళ్ళీ ఎప్పుడో డి. వెంకట్ రావు గారు రాసిన “ప్రియ శత్రువు” (Ashis Nandy రాసిన  Initimate enemy యొక్క తెలుగు అనువాదం) తాలూకా ముందు మాటలో ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ “వారి అనుభవాలూ జ్ఞాపకాలు నిజానికి వలసతత్వంపై తెలుగులో వచ్చిన అతి గొప్ప నిశిత విమర్శయే కాక సాహిత్య వాజ్ఞ్మయ తత్త్వ మూలాలని భారత జాతుల భాషల సంస్కృ తుల్లోంచి (సంగీతం గురించి వారి యోచనలు చూడండి) గ్రహించడానికి సాహిత్య రచన ఏం సాధించగలుగుతుందని సూచించిన సూత్రీకరించిన గొప్ప తాత్త్విక ద్రష్ట రచన – మార్గదర్శకపు వాఙ్మయం” అని అన్నారు . ఒక పుస్తకం గురించి ఇన్నాళ్ళుగా ఇన్నిసార్లు విన్నాక కూడా చదవలేదు అంటే ఆత్మారాముడు ఒప్పుకోడు కనుక కొన్ని నెలల క్రితం పుస్తకం చదవటం పూర్తి  అయింది. శ్రద్ధగా చదివితే మనలో ఎన్నో సంచలనాలు కలిగించగల పుస్తకం ఇది. ఫెరోజ్  గాంధీ ఏదో లోక్ సభ  స్పీచు లో అనట్టు “Mutinies in mind” కలిగించే శక్తి ఉన్న పుస్తకం ఇది. జరుక్ శాస్త్రి గారు ఈ పుస్తకం పైన అయన రాసిన వ్యాసం లో “భావ సంఘర్షణ , ఆచార సంఘర్షణ , ఆచరణ సంఘర్షణ” అని మూడు పదాలు వాడారు . ఆ మాటలు వాడే అర్హత నాకు లేదు కానీ  అదేదో సినిమాలో ఒక పాత్ర “మా టెన్షన్ లు మావండీ” అని అంటుంది. అలాగే “మా సంఘర్షణలు మావండీ ” అని అంటాను నేను. అలాంటి సంఘర్షణలు ఉన్న తెలుగు వారందరూ చదవాల్సిన పుస్తకం ఇది.

ఇది ఒక మహావ్యక్తి జీవిత గాథ . దీని గురించి కొన్ని పదాలలో నేను ఏదో  రాసి దాన్ని మీరు చదివేసి చప్పట్లు కొట్టేయటానికి ఏమి ఉండదు . పూర్తిగా చదవాల్సిందే . అయితే కొన్ని కొన్ని విషయాలు అలా మనకు గుర్తు ఉండి పోతాయి ఇలాంటి పుస్తకం చదివాక. ఆ విషయాల గురించే ఈ పరిచయం. నాలో చిన్న చిన్న విస్ఫోటనలు కలిగించిన కొన్ని విషయాల గురించి  ఈ వ్యాసం .

 

వారి కుల విద్యలు , బాల్యం చదువులు వగైరాల గురించి చెప్పినప్పుడు నాకు చాలా alien పదాలు పద ప్రయోగాలూ తారస పడ్డాయి . ఆ పదాలు ఆ విద్యల తాలూకా విషయాలు ఇపుడు నాకు కొత్తగా విజాతీయంగా అనిపించటం నా దురదృష్టం అని అనుకుంటాను . నూతన్ ప్రసాద్ ఏదో సినిమాలో అనట్టు “అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంది” కాబట్టి నా లాంటి వాడికి ఇవన్ని కొత్తగా అనిపించటంలో ఆశ్చర్యం లేదు అని సమాధాన పరుచుకున్నాను . మీ నాన్న లేదా అమ్మ ఏం చేస్తారు అని ఎవరినైనా అడిగితే “ఇన్ఫోసిస్ లో పని చేస్తారు అనో లేక డాక్టరనో లేక బిజినేస్స్మన్ అనో ఆటో డ్రైవర్ అనో చెప్పుకుంటాం” ఈ కాలంలో. ఏం చదువుకున్నారు అంటే “బీ టెక్కో ఎం టెక్కో ఇంకేదో చెప్పుకుంటాం”. ఈయనేమో “వేదము శ్రౌతము స్మార్తము జ్యోతిశ్శాస్త్రం వగైరాలు కుల విద్యలనీ” అనీ .. “మా నాయనగారు స్మార్తంలో రెండో అపస్తంబులనీ .. మంత్ర శాస్త్రంలో పాదుకాంత దీక్షా పరులనీ .. ” మొదలు పెడతారు . ఇంతలోనే ఎంత మార్పు అన్నట్టు మన చదువులు విద్యలు ఉద్యోగాలు ఏ స్థాయిలో మారిపోయాయో! నాకసలు సగం పదాలకి అర్థమే తెలీదు ఆయన చెప్పిన చదువులలో! ఇది ఈయన కులం గురించి మాత్రమేనూ! అన్ని కులవిద్యలనూ అన్ని చదువులనూ వాటి తాలూకా స్పెషలైజేషన్ లనూ తెచ్చి లెక్క గడితే తెలుస్తుంది అనుకుంట మనకి అప్పటి చదువుల విస్తృతి!

 ఇక పోతే ఉపనయనం గురించి చెప్పుకొస్తూ “సంస్కారం అబ్బటానికి విధి నిషేధాలు సాధనాలు”  అని అన్నారు . “విషయ వాంచలు అంకురించక పూర్వమే జీవితంలో విధి నిషేధ పరిజ్ఞానం ప్రారంభం అవ్వాలీ” అని అన్నారు . మనదేమో Choice, Individuality జనరేషన్ మరి! ఈ విధి నిషేధాలు మనకి నచ్చవు కదా! కరెక్టుగా మనం ఇలా అనుకోగానే శ్రీపాద వారు నెక్స్టు పంచు డయలాగుతో రెడీగా ఉంటారు . “మన వాళ్ళ నమ్మకం , చదువు సంస్కారం కోసం అని కాదు , పొట్టకూటి కోసం అని ఇప్పుడు . మన దౌర్భాగ్యానికీ  పతనానికీ ఇదే బీజం . చదువే పొట్టకూటి కోసం అయితే , జీవితం విశృంఖలం కావటానికే అయిపోతుంది . వింత ఏమిటీ ? “ అని అన్నారు . ఇంకా ఈ మాట అనేసాక ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయటానికి ఇంకేం లేదు! ఆల్ క్లియర్! Modern education system గురించి ఈ రెండు వాక్యాలకి మించి చెప్పటానికి కూడా ఇంకేం లేదు అని అనుకోవచ్చును !

ఇవి అయ్యాక గురుకుల వాసము , వారాల భోజనము వాటి తాలుకా కథా కమామీషు చెప్పుకొచ్చారు . ఎంతో ఆసక్తి తో చదివాను. ఇక తర్వాత మేఘ సందేశం , భారవి , కుమార సంభవం , ఉత్తర రామ చరిత్ర , శాకుంతలం ఇలా అయన చిన్ననాటి చదువు తాలూకా syllabus చెప్పుకొచ్చారు. ఇది చెబుతూ  “భావుకత ఉంటే , బతికి ఉన్నంత కాలం ఆనందిస్తూ ఉండడానికి ఆ ఒక్క గ్రంథం చాలు.” అని ఒక మాట అన్నారు రఘువంశం గురించి చెబుతూ . హేమిశో అని ఒక నిట్టూర్పు విడిచాను నేను . ఆనందం రఘువంశంలో ఉంటుంది అంటాడు ఏమిటి ఈయన ఆనందం అంటే ఇది కాదూ మన జనరేషన్ కి అని ?

ఇక మన ప్రాచీన విద్య విధానం గురించి చెబుతూ గుణింతాలు కాగానే బాల రామాయణం ఎందుకు ప్రారంభించేవరో చెప్పుకొస్తూ ఓ మాట అన్నారు “పిల్లల విశుద్ధ మనః ఫలకాల మీద , మొదట మొదట , మహా పురుషుల రూపాలు అంకితం చెయ్యాలి . కాకి కుక్కల క్షుద్ర రూపాలు కావు …. ఆస్తిక భావం అలవడాలి అంటే , అవగాహనా చేసుకొనే శక్తి ప్రారంభం కాక పూర్వమే దైవ భక్తికి సంబంధించిన కొంత వాజ్ఞ్మయం నోటికి  వచ్చి ఉండాలి . ఈ అంశాలు బాగా పరిశీలించి , అప్పుడాలోచించండి – చూస్తేనే తెల్సుకోగలిగే “ఆవుకు నాలుగు కాళ్ళు ” అనే విషయమే చదవాలో , బాల రామాయణమే చదవాలో పిల్లలు?” అని . నిజమే ! A for apple చదువుకీ  ఈ చదువుకీ మూలాల్లో చాలానే తేడా ఉంది !

ఇది చెప్పాక “ప్రారంభంలో బండవల్లన చేయకూడదనడమూ , పిల్లవాడే స్వబుద్ధితో సకలమూ గ్రహించాలనడమూ తప్పుడు సిద్ధాంతాలు , పూర్తిగా “ అని అన్నారు . అలా ఎందుకు అన్నారో తెల్సుకోవాలంటే పుస్తకం చదవండి మరి !

ఇక మరొకచోట వాడ్రేవు రంగనాయకమ్మ అని ఒక జమిందారు గురించి చెబుతూ సకల విద్యలలోను ఆమెకు శ్రుత పాండిత్యం ఉండేదనీ, సామాన్య పండితులు ఆమె ఎదుట మాట్లాడటానికే జంకేవారు , తరచు. ఆమె చేత వోహో అనిపించుకోవడం సామాన్యమైనది కాదు అని అన్నారు. అనగా మనకి ఆడ పండితులు కూడా ఉండెడి వారు అనమాట .. కాని మేము చదివెడి చదువులలో మాకు చెప్పెడి చరిత్ర పాఠములలో ఇట్టి విషయములు చెప్పరు అనమాట . మాకు నిజాలు తెల్సిపోతాయి కదా మరి! మేము ఆ కాలంలో స్త్రీలకు అసలు ఏ విధమైన బుద్ధి జ్ఞానము లేదు అనీ వారు అంధకార కూపములో మగ్గిపోయేవారనీ అనుకోవాలి అనమాట. అదే శ్రేయస్కరము కాబోలు పాలించే  పెద్ద దొరలకి! (అప్పటి తెల్ల దోరలకీ,  ఇప్పటి నల్ల తోలు కప్పుకున్న తెల్ల దొరలకీ)

మరొక చోట “పాండిత్యం , కవిత్వం , చందశ్శిల్పం – ఇవన్ని పుష్కలంగా ఉంటేనే పద్యం , లేకపోతే అది ముళ్ళ డొంక , లేక చేపల బుట్ట “ అని అన్నారు . అసలు పద్యాలే ముళ్ళడొంక అని అనుకుంటున్నాం ఏమో  కదా మనం ఇప్పుడు?!

ఇదిలా ఉంటే శ్రీపాద వారు సంస్కృతం – తెలుగు గురించీ చెప్పిన విషయాలు , కుల విద్యల పట్ల మమకారం తగ్గటం గురించీ , బ్రహ్మ సమాజ ప్రభావం గురించీ , ఆచార బహిష్కారం గురించీ చెప్పిన విధానం  నన్ను అలా పుస్తకానికి కట్టి పడేసింది . దీనితో పాటు పంచాంగం వేయటము దాని వెనుక ఉన్న గణితము వగైరాల గురించి రాసిన విషయాలు నన్ను ఎంతో  ఆకట్టుకున్నాయి .

ఇక ఈ నెక్స్టు వచ్చే వాక్యాలు ఉన్నాయి చూసారూ ! ఆహా ఏం చెప్పారండి!
 
“ఒక్క పద్యం కడితే చాలదూ , వంద రూపాయలెందుకూ ” అని అప్పుడూ “ఒక్క వాక్యం చాలదూ , వెయ్యి రూపాయలెందుకు” అని ఇప్పుడూ నా తృప్తి.
ఇది అన్నం పెట్టదు నిజమే . మరి ఇది కలిగించే ఆనందం ఎన్ని కోట్లైనా డబ్బు కలిగించగలదా?
అసలు , డబ్బుకి ఆనందానికి సంబంధం ఏమిటీ ?
డబ్బు భౌతికం .
ఆనందమేమో  ఆధ్యాత్మికం .
ధనికులనుభవించేది ఆనందం కాదు , సుఖమైనా కాదు , లాలసత అది .
డబ్బు అంతస్తుని బట్టి అది హెచ్చుతూ ఉంటుంది , తగ్గుతూనూ వుంటుంది , గాలి విసురు లాగ .
ఆనందం అలా కాదు అందుకోగేలిగితే దానికి ఒకటే స్థాయి”
 
 


ఇది చెప్పి కవికి ఉపనిషద్వేత్తలకూ యోగులకు కలిగే ఆనందం వంటిది  కలిగెడి విధానం గురించి వివరించారు . ఋషి కాని వాడు కవి కాదు అని కూడా అన్నారు . కవితా  సమాధి అని ఒక పదం వాడారు . చాలా తెలిసింది కవి గురించి కవిత్వం గురించి నాకు ఈ పేజీలు చదివాక ! ఇంకెప్పుడైనా ఎవరన్నా కవిత్వం నా హాబీ అని చెబితే ఈ పేజీలు  జిరాక్సు చేసి ఇస్తా వారికి . కవిత్వం అంటే ఇదీ అని . కవి అంటే వీడు అని .

మరొక చోట ఈ మాట అన్నారు .. అది కూడా నచ్చింది నాకు .
 
“కాలం – కాల చక్రం గిర్రున తిరిగిపోతుంది కాని నిలకడగా ఉండదు మరి .
జాతిని జాతినే మర్చేస్తుంది అది , వొక్క వ్యక్తీ లేక్కేమిటి దానికి సాధారణంగా? 
గుర్తుంచుకోగలిగితే – సత్యం అంగీకరించగలిగితే – ఉద్రిక్తం కాకుండానూ ఉండగలిగితే – మనం అందరమూ మారాము.
చాలా చాలా మారాము .
తలొక మొస్తరూను, అంతే భేదం.
ఈ మార్పు మాత్రం ఏకత్వానికే , భిన్నత్వానిక్కాదు “
 

ఈ లాస్ట్ లైను చాలా ఇంపార్టెంటు అనమాట! Solzhenitsyn అని సాహిత్యం లో నోబెల్ సాధించిన పెద్దాయన ఒక పుస్తకం ముందుమాట లో ఇలా రాసారు “.. equality seen as the movement of variety toward uniformity” అని  . శ్రీపాద వారు కూడా ఏకత్వం భిన్నత్వం గురించి ఇదే అంటునట్టు ఉన్నారు మరి! మనకి ఈ equality చాలా ఇష్టం కదా మరి. మన ఆరాధ్య దైవమూనూ !

ఒక కాశీ సన్యాసికి ఒక శాస్త్రిగారికి ఒక వృద్దునికి జరిగిన సంభాషణ గురించి ఒక జ్ఞాపకం పంచుకున్నారు . గుర్తుంచుకోవాల్సిన కథ ఇది! ఒక డెబ్బై ఎనబై ఏళ్ళ వృద్ధుడు వ్యాకరణ శాస్త్రం అభ్యసించటానికి ఒక కాశీ సన్యాసి దగ్గరికి వచ్చారట . అయితే “ఈ వృద్ధునకు ఇపుడు వ్యాకరణ శాస్త్రం అబ్బటమూ , ఈ జీవితంలో అది వినియోగపడటం ఉంటుందా ” అని ఆ సన్యాసి దగ్గర అప్పటికే ఉన్న శాస్త్రికి సందేహం వచ్చిందట . అప్పుడు ఆ వృద్ధుడు “ఆత్మకి నాశనం లేదు అన్న సిద్ధాంతం తెలియదా ? పునర్జన్మ సిద్ధాంతం తెలియదా?” అని అంటూ వ్యాకరణం చదవాలని చిన్నప్పటి నుంచి తన ఆశ అనీ , బువ్వ కోసం తంటాలు పడటం తోనే తన బతుకు తెల్లవారింది అని చెప్పి, వ్యాకరణ చింతన , మననం చేస్తూ తాను చనిపోతే తనకి ఉత్తర జన్మ ఎలాగు తప్పదు కనుక అది  మనుష్య జన్మ అయితే క్రితం జన్మ పూర్వ వాసనతో బాల్యంలోనే వ్యాకరణ శాస్త్రం అవగాహన అయి నా కోరిక సిద్ధించదా ? అని ఎదురు ప్రశ్నించాడట ఆ వృద్ధుడు ! బాబోయి .. శ్రీ పాద వారనట్టు తిరుగులేని వాదం ఇది! శంకరాచార్యులు ఆ చిన్న వయసులో గురు సుశ్రుష తో అంతటి వేత్త అయినారా? అని మనకి ఎదురు ప్రశ్న . ఈ పునర్జన్మ సిద్ధాంతాలు ప్రాక్తన సంస్కారాలు మాకొద్దు అని అనుకుంటే మహా అంటే ఏమంటాం  .. It is all in the genes .. అనేసి చేతులు కడుక్కుంటాం!

ఇక పోతే పండితులు విద్యాదానం చేయటమూ సంపన్నులు అన్నదానం చేయటం గురించి చెప్పుకొస్తూ గురుకులాల గురించి ప్రాచీన విశ్వవిద్యాలయాల గురించి ఎన్నో విషయాలు తెలిపారు . “సేవ్య సేవక ” సంబంధం పెట్టుకోకుండా ప్రభువులూ సంపన్నులూ పండితులని ఎలా పోషించారో చెప్పారు. ఈ కాలంలో ప్రభుత్వ పాఠశాలలలో అత్తెసరు చదువులూ  ప్రైవేటు పాఠశాలలలో భారీ బడ్జెట్ చదువుల పద్ధతులు మాత్రమే ఎరిగి ఉన్న నాకు ఈ విద్య విధానం నచ్చింది. ఇదొక మూడవ ప్రత్యాన్మయం .

కవి తన గ్రంథం తానే అచ్చువేయించుకోవటం అనే పద్దతిలోని సాధక బాధకాల గురించి కొన్ని విషయాలు చర్చించారు . రాజ పోషకులు పోయి ప్రజా సత్తకం వచ్చాక కలిగిన మార్పుల గురించి కూడా చాలానే రాసారు. ఈ పరిస్థితికి బ్రిటిషు పాలనా మరియు  ప్రజా సత్తకంలో కవులని ఆదరించవలసిన బాధ్యత మీద పడిందన్న జ్ఞానం లేకపోవటము కొన్ని కారణాలని చెప్పుకొస్తూ, నాయకుల లేమి మరొక ముఖ్య కారణం అని అన్నారు. “ఏ జాతికి నాయకుడు లేడో ఆ జాతి వారు, చదవ్వలసినవి చదవరు , చూడవలసినవి చూడరు , చెయ్యవలసినవి చెయ్యరు , మానవలసినవి మానరు. వారు తమ వారు చెబితే లక్ష్య పెట్టరు, అసలు విననేవినరు. పోనీ అంటే, ఇతరులు చెబితే దాసోహం అనకామానరు” అని అన్నారు . నిజమే  అసలు ” – వలసినవి” అన్న విషయం దగ్గరే కదా మనకి చిక్కంతా నేడు . నువ్వెవడివోయ్ నాకు చెప్పటానికి అని అంటాం వెంటనే .

ఇలాంటివే మరి కొన్ని ,
“మంచి ఎక్కడ ఉంటే అక్కణ్నుంచి అది గ్రహిస్తామంటారు మనలో కొందరు , మన సంప్రదాయం మంచి చెడ్డలు మాత్రం లేశమూ ఎరగరు.”
 దీన్ని contest చేయటం చాలా కష్టం ఇప్పుడు కూడా. మన సంప్రదాయం గురించి చిన్నచూపు , prejudice ఏ ఎక్కువ చాలా వరకు నేటి dominant discourse లలో. ఆ సంప్రదాయాన్ని పూర్వా పక్షం చేసే సత్తా ఉండదు వీరెవరికీ. ఊరికనే అలా మాట పడేస్తారు అంతే .
 
 

 
 
“భారత జాతీయత ” అన్న మాట గురించి కొన్ని వాదాలు చేసారు శ్రీపాద వారు.
“భారత దేశానికి ప్రత్యేక భాష ఏదీ , ప్రత్యేక వేషం ఏదీ , ప్రత్యేక సంప్రదాయమున్నూ ఏదీ భారత జాతీయత రూపొందటానికీ ?”
అని ఒక straight question అడిగారు ఈ విషయమై . మన ప్రత్యేకతలోన్నే మన జాతీయత ఉంది అని అనిపించింది నాకు ఇది చదివినపుడు . మన రూటే సపరేటు కదా!

 

మారుతున్న వేషభాషలు సంప్రదాయాల గురించి కొన్ని మాటలు అన్నారు . నన్ను అలా చాలా సేపు ఆలోచనలో పడేసిన వాక్యాలు ఇవి. నేను వక్ర వాదనలు, మెట్ట వేదాంతమూ చెప్పి కాదన్న సంప్రదాయాలు యెన్నో ! ఫ్రేము కట్టి పెట్టుకోవచ్చు ఈ వాక్యాలను కలోనియల్ పాలనలో అవస్థలు పడ్డ ప్రతీ దేశపు పౌరుడూ ముఖ్యంగా తెనుగుదేశపు వారు !

“వెయ్యేళ్ళ మహమదీయ పరిపాలన తెచ్చిపెట్టలేని మార్పులు తెచ్చి పెట్టింది , నూట యాభై సంవత్సరాల క్రైస్తవ పాలన మనలో .
చాలా మంచి విద్యాధికులను తన వలయంలోకి తీసుకోలేకపోయినా, బ్రహ్మ సమాజం , ఆర్య సమాజం వంటి కొత్త సాంప్రదాయాలను ప్రారంభించేటట్టైనా చేసింది క్రైస్తవ మతం .
కళ్ళకు వెలుగిచ్చి కొత్త బాటలు కనపర్చి దృక్పథమే మార్చేసింది , ఇంగ్లీషు వాజ్ఞ్మయం , మనకు .
వైదిక విద్యలు నేర్చి స్వధర్మ విష్టులై ఉండిన వారిని కూడా తమ కుమాళ్ళని ఇంగ్లీషు చదువులో ప్రవేశ పెట్టేటట్టు చేసింది ఉద్యోగ వ్యామోహం .
“వీరి కధికారం ఉంది , వీరికి లేదు ” అనకుండా అష్టాదశ వర్ణాల వారికి పఠన పాఠనావకాశాలు కల్పించింది రాజ్యాంగం .
దీంతో మన ధర్మ సౌధం పునాదుల కంటా కూలిపోయింది .
అయితే , స్వాతంత్ర్యం వచ్చింది కనుక , మళ్ళీ మన స్వధర్మం ప్రతిష్టింపబడుతుందా మన గడ్డ మీద ?
లేదు , లేదు , అందుకూ అవకాశం లేదు .
ఇంగ్లీషు వాజ్ఞ్మయం జీర్ణించి , స్వధర్మ పరిజ్ఞానం మొదలంటా నశించి , పైపెచ్చు బ్రిటీషు వారి  అడుగుజాడలు విడిచి పెడితే నిలవలేని వారి చేతిలో ఇరుక్కుపోయి ఉంది మన ప్రభుత్వ యంత్రం ఇప్పుడు .
బ్రిటీషు వారి చేతిలో కంటే వీరి చేతులో ఎక్కువ దెబ్బ తింటుంది మన స్వధర్మం .
మన జాతికి ముందే ఉంది ముసుళ్ళ పండగ .
వెనకటి వాటి స్మృతి చిహ్నాలు లేకుండా పోతాయి అనేకాలు .
జన సామాన్యానికి , రాజకీయాలే తారకం అన్న అజ్ఞానం పోతే తప్ప మనకి మరి గతి లేదు .
ప్రాతిపదికలకు భంగం రాకుండా స్వధర్మానికి కొత్త సంప్రదాయం సృష్టించగల సమర్ధులు ముందు రావటం లేదు ఇప్పటికీ మరి “
 

ఇది కేవలం ఒక వర్గానికో లేదా కులానికో సంబంధించినట్టుగా అనిపిస్తే నేనేం మాట్లాడలేను. అది వారి వారి  విజ్ఞతకే వదిలేస్తాను . వలసతత్వం జాతి మేధ పైన ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాలన్నీ మనం మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉంది. “ధర్మ సౌధం  పునాదుల కంటా కూలిపోయింది” అని అంటే “మంచి పని జరిగింది . ప్రపంచ శాంతికి ఇది తొలి మెట్టు . నిత్య నూతన సమ సమాజ నిర్మాణానికి ఇదే నాంది. That was a regressive system you know” అని అనుకొనే వారు కూడా ఉన్నారు నేడు . అయితే వీరిలో వలస తత్వ ప్రభావానికి లోను కాకుండా ఎంత మంది  తమ తమ స్వధర్మాలనూ సంప్రదాయాలనూ చరిత్రనూ అర్థం చేసుకొన్నారో ఆత్మావలోకనం చేసుకోవాలేమో ?

ఇక నెక్స్టు మరికొన్ని అక్షింతలు !
 
“ఇప్పటి మనవారి చదువు వేరు .
అది లేశము జాతీయము కాదు
రసానుభవ పధ్ధతి వేరు
అది యేకొంచమూ భారతీయం కాదు .
….
….
ఎటూ కాని తరం ఇది
పోనీ అంటే ఏ సంస్కారమూ అస్తిగతం కాని తరం ఇది .
చరిత్రకున్నూ ఎక్కలేని తరం ఇది”
 
అలా సాగిపోతుంది శ్రీపాద వారి వాక్ప్రవాహం
 
 

 

సనాతనమైన రాజ్యాంగ వ్యవస్థ గురించి చెబుతూ
 
“రాజు మొదలు తలారి దాకా – రాశిలో అంతా ఒకటే , రకం లోనే భేదం. అనేక కారణాల వల్ల ఆ రాశి చెడింది మన దేశంలో . ఇప్పటికి ఇదే స్థితి మనది “
 
అని ఒక మాట అన్నారు
 
ఇక నెక్స్టు వచ్చే వాక్యాలు కూడా బాగా గుచ్చుకునేవే గుర్తుంచుకోవల్సినవే !
 
” … ఆ ఇంగ్లీషులో ప్రవేశించిన వారున్నూ మన విద్యలకూ , మన సంప్రదాయాలకూ , మన ధర్మానికీ దూరం కాలేదు
పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యలూ నేర్చుకున్నారు , ఇళ్లల్లో వర్ణాశ్రమాచార ధర్మాలు పాటించుకున్నారు , లక్షణంగా వారు .
ఆ “ఇంగ్లీషు వారి ” కొడుకులూ నయమే కొంత .
కొంచెం బద్ధకం అన్నది ప్రారంభం అయినా , మన ధర్మాలు వింటూ , మన సంప్రదాయాలు చూస్తూ మన ఆచారాలు విడిచిపెట్టని వారే వారు .
ఆ కొడుకుల కొడుకులూ మనవలూనూ ఇప్పటి వారు
వారిని చూసి అదే నాగరకత అనుకొని గుడ్డిగా దానికి దాసులైనవారున్నూ యిప్పటి వారు .
సంప్రదాయం విచ్చిన్నమయిపోయింది , వీరు బయలు దేరేటప్పటికి .
మన విద్యలూ , మన ధర్మాలూ అజ్ఞాన విలసితాలయి పోయాయి వీరికి .
పోనీ అంటే , ఆ ఇంగ్లీషు విద్యలంటాయే గానీ ఆ సంస్కారం అబ్బలేదు , నికరమైంది వీరికి .
ఆ యింగ్లీషు సంప్రదయమున్నూ అంటలేదు , జాతీయమైంది .
అంట లేదంటే అసాధ్యం అయి కాదు . ఎబెట్టయి .
ఆ యింగ్లీషు చదువులను తామనుకరింప గలిగారే కానీ , తమ స్త్రీలను ఆ యింగ్లీషు స్త్రీలను అనుకరింప జేయలేకపోయారు వీరు మరి
మాట్టాడితే అరిస్తాటిలు , సోక్రటీసూ , డార్వినూ – ఇత్యాదులు స్పురిస్తారు వీళ్ళకి
పోనీ , వారి మాట మీద నడుస్తారా ?
అది చేత గాదు మళ్ళీ
ఏమంటే?
మన దర్శనాలంటే అసంతృప్తీ క్రిస్టియన్ దర్శనాలంటే అపనమ్మకమూనూ వీరికి .
“ఇతో బ్రష్ట: స్తతో బ్రష్ట: “
ఇది పనికి రాదు – అది పని చెయ్యదు
జ్ఞానం – సంస్కారం – ద్రక్పథం – సాధన – ప్రప్యం అన్నీ తమ తోనే ప్రారంభం వీరికి”

అరువు తెచ్చుకున్న భావజాల ప్రభావం తో అవాకులు చెవాకులు పేలటమే వచ్చు మనకి . నిజంగా ఇది చదివాక నాకు అనిపించింది ఎడ్యుకేషన్ సిస్టం అనేది ఎంత శక్తివంతమైనదో అని . చిన్నపుడు మరియు చదువుకొనే వయసులో మనలో నాటే బీజాలు చాలా ప్రధానం. ఈ విషయమే చెబుతూ శ్రీపాద వారు ఈ మాట అన్నారు

“ఇంగ్లీషు వారు మన యూనివర్సిటీల్లో , తమ చేతి కింద గుమాస్తాగిరి నిర్వహించగలవారు తయారు కావడానికి చాలిన విద్యా ప్రమాణం మాత్రమే ప్రవేశ పెట్టగా , అదే సర్వము అనుకున్న వీరి భవితవ్యం మరో విధంగా ఎందుకు ఉంటుందీ ? “

బంకించంద్ర నవలలు చదివి మన వాళ్ళు కొత్త ప్రపంచంలో పడ్డారని అన్నారు . అలా పడ్డవారు బంగాళీలే గొప్ప వారు ఆంధ్రులు అధములు అని అనుకోవటం గురించి కూడా చెప్పారు . జరుక్ శాస్త్రిగారు ఈ పుస్తకం మొదట్లో రాసిన అభిప్రాయంలో “తెలుగులు ప్రతి దాంట్లోకి గభీమని ఉరికారు . ప్రతి ఉద్యమంలోని చెడు మనకే పట్టింది “ అన్న వాక్యాలు గుర్తొచ్చాయి నాకు ఇది చదివినపుడు . ఇప్పటికి కూడా పరిస్థితిలో పెద్ద మార్పు ఏమి లేదు .  అప్పట్లో కనీసం బంకించంద్ర నవలలు అయినా ఉండేవి ఇప్పుడు ఆ  మాత్రం ప్రమాణం కూడా లేదు ! తెలుగు చదవటమే మానేసాం కదా మరి !

ఇక బంకించంద్రని వీరేశలింగం ని పోలుస్తూ రాసిన కొన్ని వాక్యాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి . వీరేశలింగం గారు రాసిన రచనలు ఏవి నేను పెద్దగా చదవలేదు . ఒకటో అరో అంతే. అయితే ఈ మధ్య కాలంలో సంఘ సంస్కర్తలు అందరు చరిత్ర పుస్తకాల్లో చెప్పినంత గొప్ప వాళ్ళు మహా పురుషులు ఏమీ కారు అనైతే తెల్సుకున్నాను. వాళ్ళ లోపాలు వాళ్ళకి ఉన్నాయి. చాలా వరకు సందర్బాలలో పెద్ద సంస్కర్తలు అని నేడు కీర్తి ప్రతిష్టలు పొందుతున్న వారు కూడా అప్పటి వలస పాలకుల పన్నాగాలకి కొద్దో గొప్పో బలిఅయిన వారే అని తెల్సుకున్నాను. వీరేశలింగం గారి గురించి శ్రీపాద చేసిన ఈ వ్యాఖ్యలు తప్పకుండా ఆలోచింపజేసేవే!

“సత్యం గుర్తించగలిగితే -
సంఘం సంస్కరించాలన్న చూపు వీరేశలింగం గారిది .
అంతటితో పరిమితమైపోలేదది , జాతిలో బ్రాహ్మధర్మం ప్రవేశ పెట్టాలని వారి పూనిక .
ఇందుకోసం మన ధర్మాన్ని తూర్పరపెట్టారు వారు .
“మన జీవ సరణి ఒక మురికి కూపం ” అన్న భావన పుట్టించారు మన వాళ్ళకి వారు . “

వీరేశలింగం గారి సంగతి నాకు పక్కాగా తెలీదు కాని ఈ “మురికి కూపం ” భావన మాత్రం “progressive” అని చెప్పుకొనే ప్రతి సంస్కర్తా కావాలనే కోరుకుంటాడు. గతం మురికి కూపం అంటేనే కదా మరి బంగారు భవిష్యత్తు సాధ్యం అయ్యేది ! అందుకనే కాబోలు ఎన్నో నాగరకతలు అసలు ఈ Linear time అనే కాన్సెప్టు నే వద్దనేసాయి . అసలు టైము Circular అయినపుడు ఈ progress తాలుకా తలా తోకా రెండు తెగిపోతాయి కదా మరి!

బంకిం రచనల ప్రభావంతో బంగాలివాడు తన బంగాలీ తనాన్ని బలపరుచుకున్నాడనీ , వీరేశలింగం రచనల ప్రభావంతో తెనుగు వాడు తన తెనుగుతనం అసహ్యించుకున్నాడనీ అన్నారు శ్రీపాద వారు . వీరేశలింగం గారు మన జాతిలో ఆంధ్రత్వం అపహాస్యం పాలు చేసారు అని అన్నారు . ఈ సంగతి ఏమో కానీ ఒకటి మాత్రం నిజము, అటు తర్వాత వచ్చిన  రచనలలో కూడా ఇలా మన సంప్రదాయాన్ని అపహాస్యం చేసిన వారే బాగా పాపులర్ అయ్యారు తెలుగు లో. ఇప్పటికీ  అపహాస్యం చేసే వాడు బాగా క్లిక్కు అవుతాడు . మనది మురికి కూపం అన్న అభిప్రాయం మనలో బాగా ముద్రితం అయిపొయింది కాబట్టి మనకి అవే కరెక్టు ఏమో. ఎవరన్నా వచ్చి మంచి చెప్పినా కూడా మనలోని sceptic, cynic వెంటనే జాగృతం అవుతాడు! ఛా ! మన జీవన సరణి అంత గోప్పదేం కాదు లేవోయ్ అని . అదే చెడు చెప్పి చూడండి ఇంకొక రెండు తగిలించి మసాలా వేసి మరి వాడు ఇంకొక నలుగురికి చెప్తాడు . మనల్ని మనం తక్కువ చేసుకునే ఈ అలవాటు మనకి ఎపుడు పోతుందో ఏమో .

ఇంకా బంకిం ప్రభావం తర్వాత తానూ తెనుగుతనం దృఢపరుచుకోవాల్సి రావటం గురించి రాసిన వాక్యాలు నన్ను అల కట్టిపడేసాయి . వేదవేదంగాదికలైన కుల విద్యలు వదిలిపెట్టి కలం పట్టినందుకు ఇంతకంటే ప్రయోజనం ఏమిటి అని ఎదురు ప్రశ్నిస్తారు శ్రీపాద . అయితే తెనుగు దేశమే దేశం తెనుగు భాషే భాష అని అనుకోవటం నేటి పాఠకులకి extremeగా అనిపించచ్చు . నిజానికి ఇప్పుడు ఇంకొక కొత్త వాదం కూడా బయలుదేరింది “Don’t call me Telugu or Indian, yaar . I am a global citizen” అని . ఇలాంటి వారికి శ్రీపాద వారి మాటలు కొంచెం backward గా అనిపించచ్చు ! అసలు తెలుగుతనం గురించి మాట్లాడగానే అదేదో divisive categorization లాగా చూసే జనాభా కూడా ఉంది మన దగ్గర ఇప్పుడు. వారు ఏమి చెప్పినా “We are all Indians first” అంటారు . అదేదో సంబంధం లేని విషయాలు అనట్టు . ఇటువంటి వారి గురించే అంటూ శ్రీపాద వారు ఇలా అన్నారు

“ఆంధ్ర జాతీయత ఎలాంటిదో మనకి , భారత జాతీయతా అలాంటిదే , మరి
అయితే వీటి ప్రసక్తికి భిన్నభిన్న సంధర్భాలుంటాయి .
అంటే -
ఆంధ్ర జాతీయత ప్రసక్తి వచినపుడు భారత జాతీయత స్మరణకు  రాదు .
అలాగే , భారత జాతీయత ప్రసక్తి వచినపుడు ఆంధ్ర జాతీయతా స్మరణకు రాదు .
తెజస్తిమిరాల వంటివి
తేజస్సుంటే తిమిరం లేదు
తిమిరం ఉంటె తెజస్సునూ లేదు
దేనికదే ప్రత్యేకాలివి
కలపరానివీ విడదీయరానివీ కుడానూ ఇవి
కానీ అన్యోన్యాలు “

అసలు ఏం పోలికండీ ! ఇది చెప్పుకొచ్చిన తర్వాత పృథక్త్వమూ నిర్ధారించి ఏకత్వమూ ప్రతిపాదించిన మన పూర్వీకుల తెలివి గురించి చెప్పుకొచ్చారు . Unity in diversity అసలు అర్థం ఇదా అని తెలిసి వచ్చేటట్టు ఉంది పుస్తకంలో ఈ భాగం . అసలు ఇది మొదలు ఒక నాలుగైదు పేజీలు చదువుతూ ఉంటే నా గురించి నా దేశం గురించి నా భాషా సంస్కృతుల గురించి నాలో ఉండే ఎన్నో సంశయాలు మరియు సందేహాలు పటాపంచలయి పోయాయి ! వేద వేదాంగాలు దర్శనాలు ఈ భారత ఖండానికి ఆధ్యాత్మిక బంధనం అయ్యి ఏకత్వం సిద్ధించటానికి ఎలా ఉపయోగపడ్డాయో చెప్పారు ఈ భాగం లో . ఈ ఏకత్వం సిద్ధించటానికి సంస్కృతం ఎలా సాధనం అయ్యిందో కూడా వివరించారు . రాజకీయాలు , ఆర్దికాలు , ఐహికాలు , ఆహార నిద్ర భయాదులు జాతీయాలు కావనీ వాటిలో భేదాలు ఉండటం సహజమనీ ధర్మమే జాతీయతకు మూలమనీ తెలిపారు . చరిత్ర తరచి చూస్తే ఏ సామ్రజ్యమూ సర్వకాలీకం కాలేదనీ , ఏ చక్రవర్తి ప్రాభవం శాశ్వతం కాలేదనీ ఏకత నిలిపేది ధర్మం మాత్రమేననీ ధర్మానికి ప్రవర్తకమైన భాషేననీ (సంస్కృతం)  అన్నారు .

 


 


అయితే ఇప్పటి శాసన నిర్మాణ పద్ధతిని గురించి ఒక మాట అన్నారు. నాకెంతో నచ్చింది. శాసన సభలు తరచూ ఎన్నికలు జరుపుకొవటమూ సమావేశమవటమూ శాసనాలు నిర్మించుకోవటమూ , సవరించుకోవటమూ , రద్దు చేసుకోవటమూ వగైరాల గురించి చెప్పి ఇది ఇంగ్లీషు వారు మనకి నేర్పారనీ,  ప్రపంచం అంతా  నేడు ఇదే పద్ధతి అని అన్నారు . ఇది చెప్పాక .. తన జిజ్ఞాసల్లా ఇది మంచిదా చెడ్డదా అని కాదు అనీ .. ఇది “మన పద్దతి కాదు ” అని అన్నారు . మన చిక్కల్లా ఈ “మనం” తో నే కదా వచ్చింది . మనమెవరమో మనకే సరిగ్గా తెలిదాయే! ఇంకా మన పద్దతులు సంప్రదాయాలు మనకెలా తెలుస్తాయి!

అయితే కాలానుగుణంగా ధర్మం మారుతూనే వచ్చిందనీ అయినప్పటికినీ శాసన సవరణే జరిగింది కానీ శాసన నిర్మాణం జరగలేదనీ చెప్పారు . ఈ distinction నాకు బాగా నచ్చింది . ఈ సవరణలు కూడా ఒక్కరు చేసినవి కావనీ త్రికాల జ్ఞాన సంపన్నులైన మహర్షుల పరిషత్తులు చేసినవనీ అవే యుగ ధర్మాలనీ చక్రవర్తులూ సామంతులూ ఈ శాసన సవరణలనే అనుసరించారనీ చెప్పుకొచ్చారు .

ఆంగ్లేయుల పాలనా ప్రభావం విద్యావిధానం పైన ఏ విధంగా పడిందీ చెప్పుకొస్తూ ఇలా అన్నారు. “మన సంస్కారం మనకు దూరం చేసి , తమ సంస్కారం మనకు మప్పవలసిన ఆగత్యం ఏర్పడింది వారికి. విద్యా విధానం తమ గుప్పిట్లో ఉంటేనే సాధ్యపడుతుందిది” . సాధారణంగా ఈ ఎడ్యుకేషన్ అన్నది మన సంస్కర్తల ఉద్దేశంలో ఒక Holy cow. “ఇంగ్లీష్ వాళ్ళ పుణ్యమా అనే మనకి చదువబ్బింది కానీ .. లేదంటేనా” అని అనుకొనే బాపతు వాళ్ళు ఇంకా మెజారిటీ మన దేశంలో !

ఇక పోతే సంస్కృతం గురించి చెప్పుకొస్తూ: “విడిచి పెట్టాలంటే వీల్లేని భాష అది . మన సంస్కారం అంతా  మంట గలిసి పోతుంది అలా చేస్తే . ధర్మ దూరులం అయిపోతాం మనం . ఆటవీకులదీ మనదీ ఒకటే అంతస్తు అవుతుంది అపుడు. ఇంతకంటే పతనం ఏమి ఉంటుందీ “ అని అన్నారు

భారత జాతీయత అలౌకికమైన నిర్మాణం అనీ. “ఈ అలౌకికమైన భారత జాతీయతకు అలౌకికమైన సంస్కృతమే భాష కావటం సహజంగానూ ఉంది , ఎంతో గొప్పగానూ ఉంది . అది అర్థం చేసుకోవాలంటే చిత్త సంస్కారం ఉండాలి” అని అన్నారు . ఈ లాస్ట్ లో అన్న చిత్త  సంస్కారం అన్న మాటతో క్లీన్ బౌల్డ్ చేసేసారు అనమాట నా లాంటి అర్భకపు  పాఠకుడిని . వేదం అపౌరుషేయమనీ దేవ భాష అయిన సంస్కృతం కూడా మనకి వేదం వంటిదే అనీ అన్నారు . మనమేమో “Who wrote the vedas yaar?” అనే కాలంలో పుట్టాం . ఈ అపౌరుషేయాలు దేవభాషలు అంతా fiction అంటాం . ఉదా : http://en.wikipedia.org/wiki/Vedas చూడండి . శ్రీపాద వారేమో “అపౌరుషేయం అది ” అని ఖరాఖండిగా చెప్పేస్తారు . మనం  ఏమో “supposed to have been directly revealed” అని డవుటుతో రాసి మళ్ళీ “Chronology” అని ఇంకొక సెక్షన్ “Vedic period” అని ఇంకొక పేజీ పెట్టేస్తాం. ఇంకా ఇన్ని డవుట్లు వచ్చేసాక ఇంకా అపౌరుషేయం ఏంటి వంకాయ్! మూలలలోనే ఇన్ని అబ్జెక్షన్స్ ఉంటే ఇంక ఈ దేవభాష , ధర్మం ఇట్టాటివన్నీ  నమ్ముతామా ఏంటి !
భారత ఖండం కాండం వంటిది అనీ, ఆంధ్రం – వంగం – కర్నాటకం – మహారాష్ట్రం వగైరాలు కొమ్మలవంటివి అని చెప్పుకొస్తూ , “భారతీయైక్యత , మాన ప్రాణాల కంటేనూ మన కందరికీ ముఖ్యం . దాన్ని మనం అందరం పోషించుకోవాలి అని . మనం ఆంధ్రులం . మన భాషను  మనం పోషించుకుంటాం . మన జాతీయతను మనం ధృడ పరుచుకుంటాం . మన దేశం మనం బాగు చేసుకుంటాం” అని అన్నారు .
ఇదంతా చెప్పాక ఒక పవర్ ఫుల్ మాట అన్నారు .
 
“వైదిక ధర్మం విడిచిపెట్టేసుకుంటే – ఆ సంస్కృత భాష కూడా విడిచి పెట్టేసుకుంటే – మన భారతీయతనూ , మన జాతీయతనూ , మన మాన ప్రాణాలనూ నిలపగలవాడు సృష్టి లో లేడు” అని .
 

అయ్య బాబోయ్ ఏంటి అంత మాట అనేసారు అని అనుకున్నా  నేను మొదట చదివినపుడు . ఆలోచించగా ఆలోచించగా కొంచెం కటువుగా ఉన్నా నిజమేనేమో అనిపించింది.  మరీ hostile గా indifferent గా అయిపోయి నా జాతీయతకు అవేవి అడ్డు రావు I am still an indian you know అని కూడా అనుకోవచ్చును . అంతా అనుకోటంలోనే ఉందని కదా లోకోక్తి!

ఇక పృథక్త్వం ఏకత్వం గురించి చెప్పుకొస్తూ , కుటుంబం, ఇల్లు, వీధి, పేట , వూరు , ఫిర్కా , తాలూకా , జిల్లా , రాష్ట్రం వరకే ప్రత్యేకత అని . దాని పరిధి అది అని చెబుతూ . ఈ పరిధికి రక్షణ భారతీయత అని అన్నారు . మన ప్రత్యేకతల్లోనే మన భారతీయత అంతర్లీనంగా ఉంది . అంతేకానీ సెపరేటుగా భారతీయ భాష భారతీయ సంస్కృతి అంటూ ఏమి లేదు మనం ఎగేసుకొని ఫాలో ఐపోటానికి !

 


 

ఇంకొక చోట పూర్వీకుల గురించి తలుచుకుంటూ కొన్ని మాటలన్నారు . ఈ మాటలలో వారి ఆవేదన స్పష్టంగా తెలుస్తోంది .

“మా తాత గారలాంటి వారు కావటం మాకెంతో గర్వ కారణం .
మరి , నేనిలాంటి వాడిని కావటం వారికి?
ఈ భావన అంతరించిపోతోంది ఇప్పుడు .
పోతోంది ఏమిటి పోనే పోయింది .
“సంపాదించు ఎలాగో ఒక లాగా సంపాదించు . కుడి చేతా ఎడమ చేతా గూడా సంపాదించి పోగులు పెట్టు . దర్జాగా అనుభవించు ” ఇదీ యిప్పటి నినాదం .
మన విద్యలు వినకబడ్డాయి
మన సిద్ధాంతాలు వినపడడం లేదు
మన ధర్మం మరుగున పడిపోయింది
భారతీయులం మనం
ఆర్యులం
ఆధ్యాత్మికం మన సంస్కారం భౌతికం కాదు
కానీ , ఏమిటీ మన దెగ్గర ఉన్నది ఇప్పుడు ?
ఇది తలుచుకుంటే , గుండెలు బద్ధలాసి పోతున్నాయి .
మన ధర్మం దానికది మరుగున పడిపోలేదు
మనం విడిచి పెట్టేశాం .
పాతాళానికిన్నీ తోక్కేశాం
“అది ఆటవికుల దశ ” అనిన్నీ నిరసిస్తున్నాం
ఇది మన పతనాని కిప్పటి అవధి “

ఒకటి మాత్రం నిజం నా గతం గురించీ  నా సంస్కృతీ  సంప్రదాయం గురించీ  కేవలం నా పాఠశాల విశ్వవిద్యాలయ చదువు ఆధారంగా నేను ఆలోచించినట్టు అయితే కచ్చితంగా అదేదో ఆటవిక దశ నుంచి బయటకి వచ్చేసానోచ్ అనే అనుకుంటాను ! ఇది పతనం అని ఎలా ఒప్పుకుంటాను నేను ? ఇదే డెవలప్మెంట్ అని కదా మన థీసిస్సు ! బాగా ఆలోచించవలసిన విషయం .

ఇక నెక్స్టు చదువుకు డబ్బుకు ఉన్న లంకె గురించి కొన్ని మాటలు అన్నారు . ఆఫ్ కోర్స్ చదువు అనగానే ప్లేస్ మెంట్ గారంటీ నా ? జీతం ఎంత  రావచ్చు ? ఇలా అడుగుతాం మనం ఫస్టు . కాబట్టి మనకి ఇది కొంచెం కష్టమైన కాన్సెప్టే !

“చదువుకోడం , ఈశ్వర లీలలు అవగాహన చేసుకోడానికి , డబ్బెందుకు మరీ ?
ఆనందం అదా , తెగ తినడమా ?
……
ఒక్కొక్క విద్యా అవగాహనా అవుతూ ఉంటే – అవధి ఎక్కడ ఆ ఆనందానికి ?
చిళ్ళ పెంకు కాదూ దాని ఎదట డబ్బు ?
మన విద్యల పరమార్థం ఇది .
మన సంస్కారం స్వరూపం ఇది .
మానవ జన్మకున్నూ పరమావధి ఇది”
“చదువు జ్ఞానం కోసం
మరి డబ్బు ?
కాలక్షేపానికి మాత్రమే , పోగులు పెట్టడానికి కాదు
కనక , దాని కోసం పాకులాడ్డం బ్రహ్మడైనవాడికి పతనం
దేశంలో అనేకులున్నారు , పండితులు .
లోకంలో లెక్కే లేదు వారికి
ఎందరున్నారు ఇది గుర్తించిన వారు ?
ఎందరున్నారు ఇదే చూసుకొనే వారు ?
ఇక ఫిలాసఫర్స్ ఉన్నారు వారు పరిస్థితి మరీ ఘోరం
వారి సంఖ్య అంతా ఇంతా కాదు
ఈశ్వరతత్వం తెల్సుకోటానికి వారి చదువు
కానీ , పదవులు , కావాలి వారికి
ప్రమోషను మీద ప్రమోషను కావాలి
డబ్బు కావాలి , హద్దూ పద్దూ లేకుండా
వైభవాల మీద వైభవాలు అనుభవాలి , వారు
మన ఫిలాసఫీ లక్షణం కాదు
పాశ్చత్యులదిది
………
ఈ భూమండలం చాలడం లేదు , జనానికి
చంద్ర మండలానికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు , వారు
తర్వాత సూర్య మండలానికి వెళ్తారు
తర్వాత ?
మరి తర్వాత ?
హరోమ్హర
సర్వం శూన్యం
అప్పుడైనా వారి తృష్ణ తీరుతుందా ?
అది వద్దన్నారు మన వాళ్ళు
…… “

ఇలా చెప్పుకొచ్చారు . దీనిలో మళ్ళీ భూతద్దంతో వెతికి ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవహారం లాగా ఉందే అని అనచ్చును . అయితే స్వధర్మ చింతన స్వధర్మ స్వరూపం తెల్సిన వారు ఏ కులంలో ఉన్నవారు అయినా  ఇలానే చెబుతారు అని నా అభిప్రాయం . ఫలానా కులం వాడిని డబ్బు పోగెయ్యి వ్యాపారం చెయ్యి అని చెప్పిన ధర్మమే ఆ డబ్బు ఎలా దానం చెయ్యాలి ఏ ఏ పనులకి ఎంత ఉపయోగించాలి అని కూడా చెప్పింది . విశృంకలత్వాన్ని అయితే ప్రోత్సహించలేదు నాకు తెలిసి .  గాంధీ గారి భాషలో చెప్పాలి అంటే “An economy based on the foundation of endless wants  would not last long” . మనది ధార్మిక వ్యవస్థ ఆ endless wants వ్యవస్థ అయితే కాదు నాకు తెలిసి!

ఎలాగు గాంధీ గారి ప్రస్తావన వచ్చింది కనుక , శ్రీ పాద వారు గాంధీ గురించి అన్న మాటలను కూడా మనం గమనించుకోవాలి

 
“నాది వైదిక సంస్కారం
దాని మీదే ఎంతో నమ్మకం నాకు
గాంధీ గారిది జైన సంస్కారం
దాని మీదే తమ నమ్మకం అనట్టు మాత్రం కనపడరు , వారు
కానీ నిశితంగా పరిశీలించిన వారికి , వారి దండ యాత్ర , అటు బ్రిటీషు వారి మీద కంటే , ఇటు వైదిక సంస్కారం మీద చాలా ఎక్కువ అనట్టు స్పష్టం అవుతుంది
జైన భౌద్ధ మతాలకూ , వడిక మతానికీ వెనకటి శతాబ్దులలో జరిగిన దారుణ సంఘర్షణ తెలిసి ఉన్న వారికీ గానీ సమన్వయము కాదిది “
అన్నారు.

గాంధీ గారి సిద్ధాంతాలని రక రకాలుగా అర్థం చేసుకొని రక రకాల మాటలు అన్న వారు ఉన్నారు . అయితే వీరి వాదం లో ఒక ప్రామాణికత ఉంది బేసిక్ గా వీరి రచనలోనే ఒక స్ట్రాంగ్ rooted-ness ఉంది . అది ఉంటూ మాట్లాడిన వారిని ఎవరిని మనం అంత తేలికగా కొట్టి పారేయలేము . దాని వెనుక వందల వేల ఏళ్ళ క్రితం నాటి మేధావుల ఆలోచనలు ఉంటాయి మరి . విశ్వనాధ వారి వాదనలతో వచ్చిన చిక్కు కూడా అదే . “Nonsense” అని కొట్టి పడేయగేలం ఏమో గాని .. ఎందుకు నాన్సెన్స్ అంటే కూర్చొని వాదులాడలేము . మనకి ముందు వారి ఘోష అర్థం కావాలి కదా . అంటే వారి ధర్మమూ సంస్కారం వగైరాల కథా కమామీషు తెలియాలి! “సంఘ సంస్కారం కంటే మత ధర్మాలను తిరస్కరించడమే అని మన సంఘ సంస్కర్తల సిద్ధాంతం ఇప్పటికీ” అని అన్నారు . ఒప్పుకోవాల్సిన విషయం కూడానూ . అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ మత ధర్మాలు సంఘం కట్టుబాట్లు ఏదో పుస్తకం లో రాసేసి ఫ్రీజ్ చేసినవి కాదు మన దేశంలో ఎప్పుడూ . కాలానుగుణంగా మారుతూ వచ్చినవే . అయితే ధర్మ శాస్త్రాల విషయంలో శ్రీపాద వారు అనట్టు ఆ సవరణలకి ఒక పధ్ధతి పాడూ ఉండేది! అది చేసేవారికి ఒక స్థాయీ విద్వత్తూ ప్రామాణికతా ఉండేవి . మన సంస్కర్తల్లో ఎంత మందికి అది ఉంది అన్నది మనం ఆలోచించుకోవాలి అని అంటున్నారు అనుకుంటాను శ్రీపాద వారు (బంకిచంద్రుడికి వీరేశలింగంగారికి పోలిక చెబుతూ అన్నారు ఇటువంటి మాట ఒకటి ) . అందుకనే “సంఘ సంస్కర్తలు , వారితో పాటు వచ్చిన రాజకీయ వాదులు గాడి తప్పారిక్కడ ” అని అన్నారు ఈ విషయమై !

అదన్నమాట విషయం . ఇది పరిచయ వ్యాసం కంటే కూడా పర్సనల్ గా నన్ను ప్రభావితం చేసిన విషయాల గురించి రాసిన వ్యాసం అనుకోవచ్చును . నా ఫేవరేట్ ఆటోబయోగ్రఫీ ఇదే అని చెప్తాను ఇక మీదట . అయితే ఇవన్నీ బాగా ప్రమాదకరమైన ఆలోచనలు ..  తిన్నగా కూర్చోనివ్వవు  కాబట్టి ఎంతో జాగ్రత్త వహించి చదవవలసినవి . ఈ పుస్తకం చదివిన పాఠకుడికి “నేను ఇంత చాటపెయ్యనా?” అనిపించాలనీ ,   జఠర పుష్టి లేని వాడినని వాడికి వాడే తెల్సుకోవాలనీ అన్నారు జరుక్ శాస్త్రి గారు. ఈ అంతర్మథనం మనల్ని బాగా కష్టాలకు గురి చేస్తుంది అనమాట . ఇదో రకం statutory warning అనుకోవచ్చు. ఈ మధ్యన చదివిన పుస్తకాలలో nothing stirred my consciousness like this one! . మీరు కూడా చదివి ఆనందించండి ఇంకొక పది మందితో చదివించండి !

--హాలీ కళ్యాణ్
http://pustakam.net/?p=15949

Read 6865 times
Rate this item
(0 votes)
Super User

Latest from Super User