ఈ క్షణాన్ని పోనీయను
కలాన్ని పిండేయందే
కాలాన్ని కదలనీయను
అవసరమైనప్పుడల్లా
అగ్నిపుల్లతో-చీకటి
కొవ్వును కరిగించందే
కొత్తపొద్దు రానీయను''
అని ప్రతిజ్ఞ చేసి 'కవిత్వం నా మాతృభాష', 'కవిత నా శ్వాస', 'కవిత నా చిరునామా' అని ప్రకటించి 'ఇతివృత్తం మానవత్వం' అని ఉద్ఘాటించి సతతహరితంగా సాహితీ సృజనచేస్తున్న కవితా పథిóకుడు డా.సి.నారాయణ రెడ్డిగారు. ఏడు దశాబ్దాల నుంచి మానవచైతన్య చిత్రణమే ప్రధాన వస్తువుగా ఎంచుకున్న సినారె సరికొత్త ప్రక్రియలతో ఆధునిక తెలుగు సాహిత్యాన్ని విస్తృత పరిచారు. ఉత్తుంగ సాహితీశిఖరంలా నిలిచారు. 'నడక నా తల్లి, పరుగునా తండ్రి, సమత నా భాష అనే కవితాక్షరామ్నాయంలో సంస్కృతీ నాగరికతల అమృతభావనలను పొందుపరిచి 'అనంతరం నా పయనం, విశ్వం నా ఊరు, శాంతి నా పేరు' అని మానవత మూల్యాలను వర్ణించి 'సంప్రదాయాన్ని జీర్ణించుకున్న, ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని, అని ప్రయోగశాలిగా, పరిణామవేదిగా అద్భుత చరిత్రను సృష్టించుకున్న దార్శనికుడు సినారె గారు.
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిన సినారె గారు 29 జూలై 1931న కరీంనగర్ జిల్లా వేములవాడ ప్రాంతంలోని హనుమాజిపేట గ్రామంలో బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతుల కళ్ల వెలుగులా జన్మించారు. బాల్య తొలిదశలోనే ఆయన గుండెలో కవిత్వం పాటరూపంలో దూసుకొచ్చింది. సొంత ఊరు చుట్టూ అల్లుకున్న పంటచేళ్ల హృదయరాగం, అక్కడి సెలయేళ్ల నడకల ఒయ్యారాలు హరికథకుల గీతాలు ప్రేరణ అయ్యాయి. ఎదుగుతున్న వయస్సుతో పాటు పాట కూడా కొత్త నడకలతో సాగింది.
సినారె పూర్తి పేరు సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి 'సత్య'శబ్ద సాహిత్యంలోని చేరింది. ఇంటిపేరులోని 'సింగి' చైతన్య రూపంలో విస్తరించింది. అలా కాగా సి. నారాయణరెడ్డి అనే పేరు సినారెగా జగత్ప్రసిద్ధమైంది.
సినారెగారు 1953-55 సం||లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎంఏ చదివి 1962లో పిహెచ్డి పట్టాపొందారు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యా లయంలో రీడర్, 1976లో ఆచార్యులుగా విద్యార్థులకు తెలుగుభాషా సాహిత్యాలను బోధించారు. అదే సమయంలో పరిశోధక విద్యార్థులకు పర్యవేక్షకులుగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రీడర్ 1976లో ఆచార్యులుగా విద్యార్థులకు తెలుగుభాషా సాహిత్యాలను బోధించారు. అదే సమయంలో పరిశోధక విద్యార్థులకు పర్యవేక్షకులుగా పనిచేశారు. పిదప 1981-1985 వరకు అధికార భాషా సంఘాధ్యక్షుడుగా, దేశంలో ప్రథమ సార్వత్రిక విశ్వవిద్యాలయం డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా 1989-92 వరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా, ఆమహోన్నత విద్యాపీఠాల ప్రగతికి చక్కని ప్రణాళికలు రూపొందించి మేధావుల ప్రశంసలందారు.1992 రాష్ట్రభాషా సాంస్కృతిక సలహాదారుగా 1997లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా 1997 నుంచి 2003 దాకా రాజ్యసభ సభ్యులుగా విశిష్ట సేవలందించారు. ఈ పదవిని అందుకున్న తొలి దక్షిణభారత కవి నారాయణ రెడ్డి గారే. ఆ మహాకవి చాలా కావ్యాలకు రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులతో ''విశ్వంభర''కు అత్యున్నత భారతీయ జ్ఞానపీఠ అవార్డు లభించింది.
సినారెగారి సాహిత్యాన్ని గురించి వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు ఆ ప్రక్రియ సాగుతూనే వుంది. అంతేకాక ఆయన పేరుతో సాహిత్య సంస్థలు ఏర్పడ్డాయి. ఆయన పేరుతో విశిష్ట పురస్కారాలు కూడా ప్రదానం చేయబడుతున్నాయి. ఆయన పాటలు పాడి ఎందరో కళాకారులు సుప్రసిద్ధగాయకులయ్యారు. దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవడాక్టరేట్లు సమర్పించి వాటి కీర్తి ప్రతిష్టలను పెంచుకున్నాయి. రాష్ట్రంలో, దేశంలో విదేశాల్లో విస్తృతంగా పర్యటించి తెలుగుభాషా సౌందర్యాలను చాటిచెప్పారు.
సినారె విద్యార్థి దశలోనే కిన్నెర, శోభ, తెలుగు, స్వతంత్ర, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో కవితలు, వ్యాసాలు, ప్రకటించారు. అవి సాహితీపరుల హృదయాలను అలరిస్తుండేవి.
సినారెగారికి బాల్యదశలోనే సంస్కరణ దృక్పథం అలవడింది.
''మాలమాలయని మచ్చరించి మీ
సాలుదువ్వెదవదేలా!
మాలడే మహామంత్రియైన పూ
మాలవేసెదవదేలా!''
ఇలాంటివి మరెన్నో గేయాలు ఆ మహాకవి కలం నుంచి సమాజహృదయంలోకి దూసుకొచ్చి చిద్విలాసంగా పనిచేశాయి.
సినారె శ్రామిక జనపక్షపాతి. వారి త్యాగనిరతిని, ఆ చెమటలోని అందాలను గూర్చి ఎన్నో కావ్యాల్లో వర్ణించారు.
''శ్రమజీవి చెమట బిందువులో
ఆణిముత్యమూ వుంది
అగ్నిగోళమూ వుంది''
శ్రమశక్తి దోచుకుని సంపద పెంచుకునే దౌష్ట్యం నిర్మూలింపబడుతుందనే సత్యాన్ని ఉద్ఘాటించి వారికి అండగా నిలుస్తారు.
''లక్షచేతులు పండించే ధాన్యం
ఒక్కలోగిట్లో పరచుకుంటే
కోట్ల చెమటబొట్లు కురిసే మూల్యం
ఒక్క గుప్పిట్లో అణిగి వుంటే
అచ్చమైన సౌజన్యం
చచ్చుపీనుగులా పడి వుంటుందా?
రెచ్చిపోయిన రక్తఘోషతో
చిచ్చురెక్కలు సాచకుంటుందా''
అప్పుడు జ్వలించేది తిరుగుబాటేకదా!
''నరభోక్తలు మానవతను
నంజుకు తింటున్నప్పుడు
పరశక్తులు స్వజాతిపై
విరుచుకుపడుతున్నప్పుడు
కత్తులతో పాటుపైకి
సుత్తెలెత్తిపట్టించే
అడుగులతో పాటు పదును
కొడవళ్ళను కదిలించే
నాగళ్ళను, రోకళ్ళను నడిపించే
నౌకర్లను, పాలేర్లను ఉరిమించే
తిరుగుబాటులో కవితా
స్వరముద్రికలున్నవి''
అని తిరుగుబాటు కవిత్వం ప్రత్యేకతను తెలుపుతారు.
అణచివేతలతో గాయపడ్డ/మట్టిగుండె అలాగే వుండిపోదు. చతికిలబడదు. చిచ్చులా చెలరేగుతుంది. ఆ హృదయంలో విచ్చుకున్న జ్వాలల ధ్వనులు డప్పుల నాదంతో బహిర్గమ వుతుంది. అది భీకరమృగరాజు గర్జనలా వుంటుంది. ''డప్పంటే మూరెడు తోలుపేలికకాదు మట్టిగుండెల ఘోషలను పుక్కిటపట్టుకున్న మహోగ్రమృగేంద్ర కంఠం''తన రచనల్లో మానవత్వాన్ని ప్రధానంగా ఉల్లేఖించే సినారెగారు
''ఏ కులము వెన్నెలది?
తెమ్మరలెట్టి జాతికి చెందినట్టివి?
అట్టిదే కదా మానవత్వము
అన్నిటికీ ఎతైన సత్యము''అనడం ఆయన సదాశయాన్ని ప్రకటిస్తుంది.
మతం ఏదైనప్పటికీ అందులో ప్రతిపాదింపబడిన ధర్మాలు ఒక్కటే. దురభిమానం రగిలించుకుని కలహిస్తే మానవత్వం మలినమవుతుందనే విశిష్ట ధర్మాన్ని నొక్కి చెబుతారు సినారెగారు.
''ఎవడు హిందు ఏవడు తురక ఎవడురా కిరస్తానీ?
ఎవరిది తెలుగెవరిది రవమెవరిది హిందుస్తానీ
ఒకేతోట వికసించిన రకరకాల పువ్వులురా
ఒకేవాణి గుడిలో వెలుగొందిన మణిదివ్వెలురా!''
ఇలాంటివే మత సామరస్యాన్ని పెంపొందించే గీతాలు సినారె కలం నుంచి అసంఖ్యాకంగా వెలువడ్డాయి. అందులో కొన్ని లలితగేయాలై మరికొన్ని చిత్రగీతాలై సమాజహృదయంలో ప్రవేశించి మతవిద్వేషాలను తగ్గించడంలో ఉపకరించాయి.
సినారెగారి ఆకాంక్ష
''ఒక్కనోరు-
వందభాషలుపలకాలని
రెండు చేతులు-
వెయ్యి సముద్రాలు ఈదాలని
లక్ష ఊహలు-
పది పంక్తుల్లో ఒదగాలని
కోటి ఉద్యమాలు-
ఒక్క ప్రగతిగా వెలగాలని'' అనే ఆయన సంకల్పం వజ్రతుల్యమైంది.''నవ్వనిపువ్వు'' నాటినుంచి ''అలలెత్తే అడుగులు'' (2013) దాకా వెలువడిన సినారె (83) రచనల సమాజం-సమాజానికి హృదయం లాంటి మనిషి గురించి, ప్రకృతి మానవప్రకృతికి మధ్య వున్న అనుబంధాల గురించే అధికంగా ప్రస్తావింపబడింది. ఆమహాకవి అక్షరం గీస్తే, పదం రాలిస్తే, పాదాన్ని చిలకరిస్తే అది అద్భుతకవిత్వమై రసజ్ఞ జగత్తును మురిపిస్తూంది. వయస్సులో ఎనభైమూడు వసంతాలు దాటినప్పటికీ ఇంకా యువతతో పోటీపడుతూ శక్తివంతమైన, భావసౌజన్యధారతో భాసిస్తున్న సినారె గారి లక్ష్యంతో ఈ వ్యాసం ముగుస్తుంది.
''రాస్తూ రాస్తూ పోతాను-సి
రా ఇంకేవరకు-
పోతూ పోతూ రాస్తాను-వ
పువువాడేవరకు''